అత్తను గొంతునులిమి అల్లుడు హత్య చేసిన సంఘటన మండలంలోని నాగపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలమ్మ కు ఇద్దరు కూతుర్లు కాగా పెద్ద కూతురు లక్ష్మిని పుల్కల్ మండలం మంతూరు గ్రామానికి చెందిన నేనా బాగయ్యకు ఇచ్చి వివాహం చేశారు.
చిట్టి గ్రూపు డబ్బులు కట్టడానికి మంగళవారం బాగయ్య నాగపూర్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఏ పని చేయకుండా తిరుగుతున్నావని అత్త అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపంలో బాగయ్య అత్త గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.