పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై, హీరో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 105 (హత్య లేదా ప్రాణ నష్టం కేసు), 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయగా, న్యాయ నిపుణులు ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని పేర్కొంటున్నారు.
బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి, సంధ్య థియేటర్ వద్ద భారీగా అభిమానులు చేరుకున్నారు. డీజే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడంతో, ఆ ప్రాంతంలో తీవ్ర కోలాహలం నెలకొంది. పోలీసులు ఆ బృందాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు, లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది, దాంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, పోలీసులు మాట్లాడుతూ, “అల్లు అర్జున్ వస్తున్నారని ఎలాంటి సమాచారం తమకు అందలేదని” తెలిపారు.