వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద మృతి

ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మండలంలోని చంద్రవంచలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై నరేందర్‌ కథనం ప్రకారం.. మండల పరిధిలోని చంద్రవంచ గ్రామానికి చెందిన బోడ తాయప్ప, ఆయన భార్య గోపమ్మ తరచూ గొడవ పడేవారు. ఇటీవల తాయప్ప వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లిపోయేవాడు. దీంతో భార్య గోపమ్మ తన పిల్లలతోకలిసి అత్తామామల వద్దే ఉంటోంది.

ఈ క్రమంలోనే ఈనెల 27న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని అత్తామామలు గోపమ్మ తల్లిగారి కుటుంబానికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. కానీ అదేరోజు అర్ధరాత్రి పరిస్థితి విషమించి చనిపోయినట్లు మరోమారు సమాచారం ఇచ్చారు. భర్త, అతని కుటుంబ సభ్యులే బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశారని మృతురాలి సోదరుడు కండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంఘటనపై వివాహిత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.