రైల్లో నుంచి జారిపడ్డ ఓ మహిళ

రైల్లో నుంచి జారిపడ్డ ఓ మహిళ

రైల్లో నుంచి జారిపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముంబైలోని కల్వా, ముంబ్రా స్టేషన్ల మధ్య నడుస్తున్న స్థానిక రైలులో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తన మొబైల్‌ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ దొంగతో పోరాడుతూ విద్యా పాటిల్(35) అనే మహిళ రైల్లో నుంచి జారిపడింది. బాధితురాలిని డోంబివ్లి నివాసిగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కుర్లా స్టేషన్‌లో రైలు ఎక్కారు.

ఫైసల్ షేక్ అనే వ్యక్తి రాత్రి 7.15 గంటలకు కల్వా స్టేషన్ వద్ద కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. అతడు పాటిల్ ఫోన్‌ను లాక్కొని రైలు దిగడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో నిందితుడు ఆమెను నెట్టి వేయడంతో రైలు కింద పడిపోయింది. కాగా మహిళను రక్షించే ప్రయత్నంలో కోచ్‌లోని ప్రయాణికులు వెంటనే గొలుసును లాగారు. ఆ తర్వాత రైలు డ్రైవర్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడిని ముంబ్రాకు చెందిన ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.