ఫోన్‌లో ఓ మహిళను పరిచయం చేసుకొని∙బెదిరింపులకు పాల్పడి రూ.2 లక్షలు కాజేసిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్ వివరాల ప్రకారం.. సనత్‌నగర్ ఎస్సార్టీ కాలనీకి చెందిన ఓ మహిళకు మూడున్నర నెలల క్రితం ఓ వ్యక్తి ఫోన్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ మరింత దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన కూడా ఆమె ముందుకు తెచ్చాడు.
అయితే.. తనకు పెళ్లయిందని ఓ కుమార్తె కూడా ఉందని ఆ మహిళా చెప్పినా వినిపించుకోలేదు. తనను పెళ్లి చేసుకోకపోతే మన మధ్య ఉన్న పరిచయం గురించి చెడుగా ప్రచారం చేస్తానని, ఈ విషయం ఎవరికి చెప్పకూడదంటే తనకు డబ్బు పంపాలని వేధింపులకు గురి చేయగా సదరు మహిళ గూగుల్ పే ద్వారా రూ.2 లక్షల నగదు పంపింది. డబ్బు తీసుకున్న తర్వాత కూడా వేధింపులు ఆపకపోవడంతో గురువారం బాధితురాలు సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది.