పరధ్యానంలో కన్నబిడ్డను మరచి ఫ్లైట్ ఎక్కినా మహిళ !

Woman Forgets in Airport

సాధారణంగా ఏదైనా వస్తువుని ఇంట్లో మర్చిపోయి బయటకు రావడమో, లేక బయట మర్చిపోయి ఇంట్లోకి రావడమో చేస్తూ ఉంటాం కానీ ఒక అరబ్ మహిళ తన బిడ్డను విమానాశ్రయంలోని విశ్రాంతి గదిలో వదిలిపెట్టి విమానం ఎక్కేసింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆమెకు తన బిడ్డ గుర్తుకొచ్చింది. ఈ విషయం విమానంలోని మహిళా సిబ్బందికి వెల్లడించింది. దీంతో విమానం తిరిగి వెనక్కి అంటే విమానాశ్రయానికి చేరుకుంది. ఆ తల్లి ఆ బిడ్డతో కలిసి మళ్ళీ ఆ విమానం ఎక్కింది. ఈ ఘటన జెద్దాలో చోటుచేసుకుంది.

కింగ్ అబ్దుల్ అజీల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన సౌదియా ఫ్లైట్ SV832 విమానం ఎక్కిన మహిళ తన బిడ్డ కనిపించడం లేదని, విమానాశ్రయంలోని లాంజ్‌ లో మరిచిపోయానని చెప్పింది. ఈ సమాచారం తెలిసి పైలట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ను సంప్రదించిన పైలట్లు ఓ ప్రయాణికురాలు తన బిడ్డను విమానాశ్రయంలో మరిచిందని, ఆమె తిరిగి విమానాశ్రయంలో వదిలిపెట్టాలని కోరుతోందని తెలిపారు. ఏటీసీ నుంచి అనుమతి లభించడంతో విమానం గమ్యం చేరకుండానే విమానాశ్రయానికి వెనుతిరిగింది. దీంతో ఆమె తన బిడ్డను కలుసుకోగలిగింది. ప్రయాణికురాలి వివరాలను విమానాశ్రయ సిబ్బంది బయటకు వెల్లడించలేదు.