గంజాయికి బానిసైన భర్త రోజూ రాత్రి ఇంటికొచ్చాక గొడవపడడం.. పిల్లలను, తనను కొట్టి వేధిస్తుండడంతో భరించలేని మహిళ భర్త పీడ వదిలించాలని సోదరుని కోరడంతో తను సుపారీ గ్యాంగ్ సాయంతో హతమార్చేశాడు. మండలంలోని గంభీరం పంచాయతీ కల్లివానిపాలెంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన పిల్లి పైడిరెడ్డి హత్య కేసును పోలీసులు చేధించారు. ఆరుగురిని గురువారం అరెస్ట్ చేశారు. ఈ హత్యకు భార్యే సూత్రధారి అని గుర్తించారు. ఆనందపురం సీఐ వై.రవి తెలిపిన వివరాల ప్రకారం… ఆటో నడుపుతూ జీవనం సాగించే పిల్లి పైడిరెడ్డి వ్యసనాలకు బానిసయ్యాడు.
ఈ క్రమంలో గంజాయి కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవించాడు. కరోనా ఉధృతి సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గంజాయికి బానిసై భార్య అప్పలకొండమ్మను శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురిచేసేవాడు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి మత్తులో భార్య, పిల్లలతో గొడవ పడి కొట్టేవాడు. పైడిరెడ్డి బాధలు భరించలేక అప్పలకొండమ్మ తన కన్నవారి ఇంటికి వెళ్లి భర్త పీడ వదిలించాలని కోరింది. దీంతో పైడిరెడ్డిని అంత మొందించడానికి అప్పలకొండమ్మ సోదరుడు కొల్లి శ్రీనివాసరావు పథక రచన చేశాడు. ఈ మేరకు సుపారీ గ్యాంగ్‌ని ఆశ్రయించి రూ.4లక్షలు ఇస్తానని బేరం కుదుర్చుకొని రూ.20 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పైడిరెడ్డిని హతమార్చేందుకు సుపారీ గ్యాంగ్ యత్నించగా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పైడిరెడ్డి భార్య అప్పలకొండమ్మ, తల్లి సూరమ్మ ఇంటి వద్దే ఉన్నారు. వేరే గదిలో పైడిరెడ్డి నిద్రపోయాడు. ప్రణాళికలో భాగంగా కొత్తపరదేశి పాలెం గ్రామానికి చెందిన పల్లా దుర్గారావు ఇంటి బయట కత్తి పట్టుకొని కాపలా ఉండగా, ఆనందపురం మండలం, బోయిపాలెం గ్రామానికి చెందిన అప్పలకొండ సోదరుడు కొల్లి శ్రీనివాసరావు, కొత్త పరదేశి పాలెం గ్రామానికి చెందిన బోర ఆదిబాబు, భీమిలి మండలం కృష్ణా కాలనీకి చెందిన బంగారి గణేష్, వలస అప్పలరాజు అర్ధరాత్రి వేళ ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించారు.
పైడిరెడ్డి తల్లి సూరమ్మను శ్రీనివాసరావు, ఆదిబాబు, అప్పలరాజు బంధించారు. సోపాసెట్‌పై నిద్రిస్తున్న పైడిరెడ్డి తలపై గణేష్ రాడ్డుతో కొట్టి, కత్తితో పీక కోశాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సూరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు ముందుగా మృతుని భార్యను విచారించగా అసలు విషయం బయటపడింది. భర్త వేధింపులు తాళలేక తానే హత్యకు పురిగొల్పినట్టు అంగీకరించింది. ఈ మేరకు పూర్తి విచారణ జరిపిన పోలీసులు వెల్లంకిలోని ఓ పాఠశాల వెనుకవైపు మామిడి తోటలో నిందితులు ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. అప్పలకొండమ్మనూ అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి స్టీలు రాడ్డు, కత్తి, రెండు మోటారు సైకిళ్లు, 6 ఫోన్లు, రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పైడిరెడ్డి మరణం, అప్పలకొండమ్మ జైలుపాలవడంతో వారి కుమారుడు, కుమార్తె దిక్కులేనివారయ్యారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్, పదో తరగతి చదువుతున్న వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. మరోవైపు వృద్ధురాలైన పైడిరెడ్డి తల్లి సూరమ్మకు కుమారుడి మృతితో ఆసరా లేకుండా పోయింది.