వదిన మరదలి మధ్య గొడవ ఆ ఇద్దరి ప్రాణాలనూ తీసింది. వదినను బండరాయితో కొట్టిచంపిన మరదలు.. ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం మండ్య తాలూకాలోని కంబదహళ్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గిరీష్ భార్య ప్రియాంక (35), కాగా, గిరీష్ సోదరి గీతా (25). ప్రియాంకకు రెండు సార్లు గర్భం నిలిచినట్లే నిలిచి అబార్షన్ అయ్యింది. ఇటీవల మళ్లీ గర్భం దాల్చడంతో భార్యభర్తలు కలిసి మండ్యలో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని వచ్చారు.
ఇక మరదలు గీతా బెంగళూరులో ఉండేది. కరోనా వల్ల ఆమె భర్త చనిపోగా రెండు నెలలుగా వచ్చి గిరీష్ వద్ద ఉంటోంది. శనివారం రాత్రి ప్రియాంకకు, గీతా మధ్య తీవ్ర వివాదం జరిగింది. దాంతో ప్రియాంక తాను ఇక్కడ ఉండలేనని, పుట్టింటికి వెళ్లిపోతానని గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటుండగా, వెనుకాల నుంచి బండరాయి తీసుకొని వచ్చిన గీతా.. వదిన తలపైన గట్టిగా కొట్టింది.
తీవ్ర గాయమై కింద పడిపోయిన ప్రియాంక ప్రాణాలు వదిలింది. దీంతో భయపడిన గీత మరో గదిలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొంతసేపటికి ఇంట్లోనివారు, ఇరుగుపొరుగు గమనించి బసరాలు పీఎస్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వచ్చి పరిశీలించి మృతదేహాలను మండ్య ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.