లెక్చరర్‌ ని నమ్మించి 30 లక్షలు మాయం

లెక్చరర్‌ ని నమ్మించి 30 లక్షలు మాయం

వాట్సాప్‌ ద్వారా పరిచయమైన వ్యక్తిని నమ్మటమే ఆమె పాపమైంది.. స్నేహం పేరుతో ఓ మహిళా లెక్చరర్‌ని నమ్మించిన కేటుగాడు.. ఏకంగా రూ.30 లక్షలు కాజేశాడు.. దీనిపై బాధితురాలు తాజాగా హైదరాబాద్‌ సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల మేరకు.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. ఆమె వాట్సాప్‌కు రెండు నెలల క్రితం ఓ కొత్త నంబర్ నుంచి మెస్సేజ్ వచ్చింది. ‘యూకేలో తానో పెద్ద సంస్థకు సీఈఓని.. పర్సనల్ పనులపై భారత్‌కు వచ్చా. వెంట తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. మీరు సాయం చేస్తే యూకే వెళ్లగానే తిరిగి పంపిస్తా’ అని ఆ మెస్సేజ్‌లో ఉంది.

దీంతో.. అతనెవరో, ఏమిటో తెలుసుకోకుండానే ఆమె కొంత డబ్బు సాయం చేసింది. ఈక్రమంలోనే ఆ కేటుగాడు.. ‘మీరు నా మనసుకు దగ్గరైన స్నేహితురాలంటూ..’ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మీరు ఓకే అంటే యూకేలోని తమ సంస్థలో పెద్ద ఉద్యోగం ఇస్తానని చెప్పి సదరు లెక్చరర్‌కు ఆశ జూపాడు. ఈ క్రమంలోనే ఏవేవో కారణాలు చెబుతూ 2 నెలలుగా విడతల వారీగా బాధితురాలి నుంచి ఏకంగా రూ.30 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.

ఈనేపథ్యంలోనే అతడు ఫోన్‌లో అందుబాటులో లేకుండా పోయాడు. ఎప్పుడూ ఫోన్ చేసినా స్విచ్ఛాప్ వస్తుండటంతో ఆమె మోసపోయినట్లు గ్రహించింది. వెంటనే పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది.. కాగా, అపరిచిత నంబర్లు, వ్యక్తుల నుంచి వచ్చే మెస్సేజ్‌లు, లింక్‌లు వస్తే స్పందించవద్దని మరోసారి పోలీసులు హెచ్చరించారు.