ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. రోజూ ఏదో ఒకచోట కామాంధుల అకృత్యాలు చోటుచేసుకుంటుస్తున్నాయి. తాజాగా, సీతాపూర్ జిల్లాలో ఓ మహిళపై తండ్రీ కొడుకులు అత్యాచారానికి పాల్పడి, తర్వాత ఆమెను సజీవదహనం చేసే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ తన పుట్టింటికి వెళ్లేందుకు నిందితులు జట్కా బండి ఎక్కగా..తండ్రీ కొడుకులు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మిష్రిఖ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో యూపీలో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది.
సీతాపూర్ ఎస్పీ ఆర్పీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. మిష్కిఖ్ ప్రాంతంలోని నైమిషార్యణంలో ఓ 30 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, నిప్పంటించినట్టు ఎమర్జెన్సీ సేవల నెంబరు 112కి స్థానికులు సమాచారం ఇచ్చారని తెలిపారు. బాధితురాలు మిష్రిఖ్ నుంచి సింధౌలిలోని తన పుట్టింటికి వెళ్తోందని అన్నారు. ఈ క్రమంలో నిందితులకు చెందిన జట్కా బండి ఎక్కిన మహిళపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అత్యవసర విభాగానికి ఫోన్ రావడంతో అక్కడకు చేరుకుని బాధితురాలని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
బాధిత మహిళ చెప్పిన వివరాలతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. నిందితులైన తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తండ్రి వయసు 55 ఏళ్లు ఉంటుందని, అతడి కుమారుడికి 20 ఏళ్లుపైగా ఉంటాయన్నారు. ప్రస్తుతం బాధితురాలికి సితాపూర్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమెకు 30 శాతం గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. బాధితురాలి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని ఎస్పీ వివరించారు.