తనను మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ మహిళ ఆత్మాహుతి చేసుకుంది. ఆమె మంటల్లో కాలుతున్నా ఎవరూ ఆర్పే ప్రయత్నం చేయలేదు. కొందరు వీడియో తీయటంలో నిమగ్నమయ్యారు. దిండుగల్ జిల్లా కొడైకెనాల్ కేసిపట్టి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఓ టీ దుకాణం సమీపంలో మూడేళ్ల బిడ్డను ఓ మహిళ వదిలి పెట్టింది. కూత వేటు దూరంలోని ఓ ఇంటికి సమీపంలో తన ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఆమె పెట్రోల్ పోసుకుంటున్నా, నిప్పు వెలిగించినా, మంటల్లో కాలుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ టీ దుకాణంలో ఉన్న వాళ్లు తమ కెమెరాల్లో ఆ దృశ్యాల్ని చిత్రీకరించారు.
మరి కొందరు తమకేమీ పట్టనట్టుగా రోడ్డు మీద నడచుకుంటూ వెళ్లారు. చివరకు ఓ వ్యక్తి స్పందించి తన పంచెతో మంటల్ని ఆర్పే యత్నం చేసినా అప్పటికే ఆమె కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. ఆమె పేరు మాలతీగా గుర్తించారు. భర్తను వీడి జీవిస్తున్న ఆమెను ఆ ఇంట్లో ఉన్న డ్రైవర్ సతీష్ రహస్యంగా వివాహం చేసుకున్నట్టు విచారణలో తేలింది. వీరికి మూడేళ్ల బిడ్డ ఉన్నాడు. గత వారం సతీష్ మరో వివాహం చేసుకున్నాడు. మాలతీకి అన్యాయం జరగడంతో ప్రియుడి ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంది.