ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో విమానాశ్రయానికి వెళుతున్న జగన్ కాన్వాయ్‌కు ఓ మహిళ అడ్డుపడింది. పద్మావతి అతిథిగృహం వద్ద ఆమె కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లింది. ఈ సందర్భంగా వాహనం ఒక్కసారిగా ఆమెను తాకడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు లాగారు. మహిళను గమనించిన జగన్ ఆమెను పిలిచి మాట్లాడారు. కాన్వాయ్‌కు అడ్డుపడిన మహిళ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందినట్లు గుర్తించారు. తన భర్తకు ఉద్యోగం కావాలంటూ జగన్‌కు చెప్పేందుకు వెళ్లానని చెబుతున్నారు. ఆ మహిళ చేతికి స్వల్ప గాయంకాగా దగ్గరలోనే ఆస్పత్రికి తరలించారు. మరికాసేపట్లో కడపకు చేరుకోనున్న జగన్ పర్యటనలో భాగంగా ఈ రోజు పెద్దదర్గాను సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం అక్కడి నుంచి పులివెందులకు వెళ్లి అక్కడి సీఎస్ఐ చర్చిల్లో ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించనున్నారు. ఇక ఈరోజు సాయంత్రమే జగన్ విజయవాడకు చేరుకుంటారు. రేపు ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.
