విమానంలో నిద్రపోయిన మహిళ…చావుతప్పి బయటకు

woman who slept in the plane

విమానం ఎక్కగానే పడుకున్న ఆమె నిద్రపోయింది కానీమెలకువ వచ్చాక చూస్తే చూట్టూ చీకటి. విమానంలో తను తప్ప మరెవరూ లేరు. పైప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది. లైట్లు మొత్తం ఆఫ్ చేయడంతో కళ్లు చించుకున్నా కానరాని చీకటి. పోనీ ఫోన్‌లోని లైటును వేద్దామంటే బ్యాటరీ అయిపొయింది. చీకట్లో చార్జింగ్ పాయింట్ల కోసం వెతికినా ఫలితం శూన్యం. ఇలా ఓ గంటలోనే అన్ని భయాలను అనుభవించింది. చివరికి ఆ నరకయాతన నుంచి తానెలా బయటపడిందీ తన స్నేహితులకు చెప్పడంతో వారు సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో విషయం ఒక్కసారిగా వైరల్‌గా మారింది. జూన్ 9న ఈ ఘటన జరిగింది. ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం క్యూబెక్ నుంచి టొరొంటోకు వెళ్తున్న విమానంలోని ప్రయాణికుల్లో టిఫానీ ఒబ్రెయిన్ ఒకరు. విమానం టేకాఫ్ కాగానే ఆమె నిద్రలోకి జారుకుంది. విమానం టొరొంటోలో ల్యాండ్ అయినా ఆమెకు మెలకువ రాలేదు. ఇక, విమానం ల్యాండయ్యాక సిబ్బంది, ప్రయాణికులు అందరూ దిగిపోయారు. టిఫానీని ఎవరూ గుర్తించలేదు. ప్రయాణికులు అందరూ దిగిపోయారని భావించిన తర్వాత నిర్వహణ కోసం విమానాన్ని దూరంగా నిలిపారు. ఆ తర్వాత కాసేపటికి నిద్ర లేచిన టిఫానీకి భయంతో నాలుక పిడచకట్టుకుపోయింది. తొలుత తాను కలలో ఉన్నట్టు అనుకున్నానంటూ ఆ భయంకర అనుభవాన్ని వెల్లడించింది. విమానం నుంచి బయటపడేందుకు స్నేహితులకు ఫోన్ చేయాలని అనుకున్నానని అయితే, ఫోన్ బ్యాటరీ డెడ్ అయిందని పేర్కొంది. తనలోని భయాన్ని కంట్రోల్ చేసుకునేందుకు వెంటనే శ్వాసపై దృష్టి పెట్టానని వివరించింది. విమానంలో లైట్లు ఆఫ్ చేయడం వల్ల చిమ్మచీకటిగా ఉందని, అయితే, చివరికి కాక్‌పిట్‌లో టార్చ్ లైట్ కనిపించిందని తెలిపింది. దాని సాయంతో విమానం డోర్ తీసినా  బయటపడలేకపోయానని, చివరికి దాని సాయంతో ఎవరైనా ఉన్నారేమోనని వెతగ్గా ఓ లగేజ్ కార్ట్ డ్రైవర్ తనను చూసి గుర్తించడంతో బయటపడగలిగానని వివరించింది.