ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం సాయం త్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయి స్టులు మృతి చెందారు. జిల్లాలోని అద్వాల్‌–కుంజేరాల్‌ అటవీప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్‌జీ బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో కట్టేకల్యాణ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తారసపడిన మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరపగా.. డీఆర్‌జీ బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్టు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ప్రకటించారు.

గంటపాటు జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెం దారని.. వారిని మావోయిస్టు మిలటరీ ఇంటె లిజెన్స్‌ చీఫ్‌ ముసికి రాజే, కట్టేకల్యాణ్‌ ఏరియా కమిటీ సభ్యురాలు మరకం గీత, నుప్పో జ్యోతిగా గుర్తించామన్నారు. వీరిలో రాజే, గీతపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందని తెలిపారు. ఘటనాస్థలంలో ఒక 12 బోర్‌ తుపాకీ, రెండు మందుపాతరలు, రెండు బర్మార్‌లను స్వాధీనం చేసుకున్నాట్టు వెల్లడించారు.

ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారని, వారి కోసం కూంబింగ్‌ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. కాగా.. శనివారం రాత్రి 14 మావోయిస్టులు దంతెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఎదుట లొంగిపోయినట్టు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. పోలీసులపై దాడులు, రోడ్ల ధ్వంసం, మందుపాతరలు పెట్టడం వంటి కేసుల్లో వారంతా నిందితులుగా ఉన్నారని.. వారికి ప్రభుత్వ పాలసీ ప్రకారం పునరావాసం కల్పిస్తామని తెలిపారు.