హైదరాబాద్ అశోక్‌నగర్‌లో తన భర్త ఇంటి ముందు ఓ మహిళ నిరసనకు దిగింది. తన భర్త, అత్త మామ.. తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. అత్తమామలు తన లగేజీ బయట వేసి ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటిముందు నిరసన తెలిపింది.ఏలూరుకు చెందిన గౌరీకి..హైదరాబాద్ అశోక్‌నగర్‌కు చెందిన శ్రీకృష్ణలకు 2019లో వివాహం జరిగింది.
ఆమెను మూడేళ్లుగా అత్తమామలు వేధిస్తున్నారు. తన భర్తను తన నుండి దూరం చేసి వేరే ఇంటికి పంపించారు. నాలుగు నెలలుగా భర్త తన వద్దకు రాకుండా అడ్డుకుని అత్తమామలు వేధిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈరోజు ఉదయం తనను ఇంటి నుంచి బయటికి పంపించి, లగేజీ బయటవేసారని బాధిత మహిళ తెలిపింది.
అత్తమామలు తాను ఇంట్లో ఉండకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని చెప్పింది. భర్త, అత్త, మామ తనను వదులుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆమె వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.