వరల్డ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ రియాలిటీ షో ‘డబ్ల్యూడబ్ల్యూఈ’లో ఎంట్రీ ఇచ్చి.. కొద్దిరోజుల్లోనే ఇంటర్నేషనల్ ఫేమ్ దక్కించుకున్నాడు రెజ్లర్ కాళి. ఆ తర్వాత కరోనా, తన కాంట్రాక్ట్ రెన్యువల్ కాకపోవడంతో రింగ్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఇంట విషాదం నెలకొంది. దలీప్ సింగ్ రాణా అలియాస్ కాళి తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది.
దలీప్ సింగ్ తల్లి తండీదేవి.. గత కొంతకాలంగా అనారోగ్యంతో లూధియానాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతోనే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. కాళి స్వస్థలం సర్మౌర్ జిల్లా ధిరానియా గ్రామంలో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా, పేద కుటుంబం నుంచి వచ్చిన దలీప్.. చిన్నతనంలో చదువుకు దూరమైన కూలీ పనులు చేశాడు. తన భారీ కాయాన్నే పొట్టకూటి కోసం ఉపయోగించుకుని.. ది గ్రేట్ కాళి పేరుతో రెజ్లింగ్ కెరీర్లోకి అడుగుపెట్టాడు. తక్కువ టైంలోనే అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు. ఓవైపు పంజాబ్ పోలీసాఫీసర్‌గా పనిచేస్తూనే.. మరోవైపు రెజ్లింగ్ కెరీర్ కొనసాగించాడు. 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’ గౌరవం అందుకున్నాడు ది గ్రేట్ కాళి.