Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు రోజుల క్రితం అమెరికాలో మరణించిన తెలుగు నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, తన పాఠకుల కోసం చివరి లేఖను రాసి, సీల్డ్ కవర్ లో ఉంచి, దాన్ని ఎమెస్కో విజయకుమార్ కు పంపించగా, ఆయన దాన్ని బయటపెట్టారు. ఇదే విషయం ఆమె 2016 లోనే బయట పెట్టారు. ‘సెక్రటరీ’ నవల యాభై సంవత్సరాల పండగని తెలుగు పాఠకలోకం జరుపుకుంటున్న సందర్భం లో అనేక టీవీ చానళ్లు ఆవిడ ఇంటర్వూ్యలను ప్రసారం చేశాయి. అందులో ఓ ఇంటర్వ్యూ చివరలో యాంకర్ అడిగారు, ‘‘మేడమ్! మీరు ఎన్నో కథలు, నవలలు రాసారు. వాటి గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ ముగింపుగా మీరో చిన్న కథ చెప్తారా!’’ అని. దానికి సమాధానంగా సులోచనారాణి జరగబోయే దానిని ఒక కధలా చెప్పారు. దాని ప్రకారం తాను రాసిన చివరి కధ తాను చనిపోయాకే విడుదల అవుతందని ఇప్పటికే అది ఎమెస్కో విజయ్ కుమార్ కి పంపానని చెప్పారు ఆమె…కానీ ఆమె రాసింది చివరి కధ కాదు తన పాఠకులకి చివరి లేఖ, దానిని విజయ్ కుమార్ బహిర్గతం చేశారు. ఆమె వ్రాసిన చివరి లేఖ మీకోసం
నా ప్రియమైన పాఠకులారా!
నేను నవలలు, కథలు వ్రాయకుండా ఎందుకిలా వ్రాస్తున్నానా.. అని మీరు అనుకోవచ్చు! నా 16వ సంవత్సరంలోనే నేను ‘చిత్రనళినీయం’ అనే కథ వ్రాసినప్పుడు, నా మనసులో ఏ కోర్కెలూ లేవు! కథ వ్రాయటంలోనే నాకు పరిపూర్ణమైన ఆనందం. ఆ ఆనందం కోసమే మళ్ళీ… మళ్ళీ… మళ్ళీ.. 60 సంవత్సరాల పాటు వ్రాసాను.. ఆనందం పొందుతూనే ఉన్నాను. అదొక చైతన్య జలపాతం! 16 సంవత్సరాల్లో కథలు వ్రాసినప్పుడు నాకు ఎలాంటి ఆనందం, ఉత్సాహం ఉన్నాయో, ఇప్పుడూ అంతే ఉన్నాయి.. నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని నవలలు, ఇన్ని కథలు వ్రాసినా, నా మనసు కాస్తంత కూడా అలిసిపోలేదు! ఆ జలపాతం సన్నగిల్లలేదు! అదే ఉద్వేగం! అదే చైతన్యం.. 16 సంవత్సరాల వయసులో కంటే 76 సంవత్సరాల ఈ వయసులో నా మనసుకి చాలా పరిపూర్ణత వచ్చింది.. వేల మంది పాఠకులతో నేను కలిసిపోయి, వారి జీవితంలోని సంఘటనలకి స్పందించినప్పుడు, అవి నా మస్తిష్కంలో ఉన్న భాండాగారంలో నిక్షిప్తం అయి ఉన్నాయి..
వంద సంవత్సరాలు వ్రాయగల కథల వస్తు సామగ్రి నా దగ్గర ఉంది..! కానీ నా శరీరం వయోభారంతో అలిసిపోయింది. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకూ మీకు ఏదో ఒకటి వ్రాసి ఇస్తూనే ఉంటాను.
నన్ను చాలామంది ‘‘మృత్యువు’’ గురించి ఎందుకు మాట్లాడతారు అని అడుగుతారు. 70 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తికీ ఈ ఆలోచన వస్తుంది. ఇది మన ముందున్న యథార్థం! ఒక నగ్నసత్యం! ఈ నగ్నసత్యం లోకి మనం నిర్వికారంగా, హుందాగా, ఆనందంగా నడిచి వెళ్ళాలి! నేను లెక్కచూసుకున్నాను.. అయిన వారంతా… అమ్మా–నాన్నా, అక్కయ్యలు–బావలు, అన్నయ్యలు–ఒదినలు, పిన్నులు–పినతండ్రులు, మేనత్తలు– మేనమామలు. ఎందెందరో బంధుజనం.. అందరూ పోయారు. నా వృత్తిలో ముఖ్యమైన శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ రామానాయుడు గారు, శ్రీ మధుసూదనరావు గారు, శ్రీ ఎల్వీ ప్రసాద్ గారు, ఇంకా పత్రికాధిపతులు, పబ్లిషర్స్, కొంతమంది ప్రియమైన పాఠకులు, అందరూ వెళ్ళిపోయారు.. నేను వెళ్ళిపోవాల్సిన సమయం వస్తోందని నాకు బాగా తెలుసు!
నాకు ఎప్పుడు ఏది అనిపిస్తుందో అది మీ ముందు పెడుతున్నాను. నా ఆలోచనలు పంచుకునే నా ప్రియనేస్తాలు మీరు!
ఇప్పుడు నేనేదైనా వ్రాసిస్తే అది మీలో ఉన్న ఆ భగవంతుడికి అక్షరార్చనగా భావిస్తాను! ఈ వయసులో ఇంత ప్రశాంతంగా నేను మీకోసం ఈ భావపుష్పాలని మాలగా అల్లడం నాకెంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తున్నది.
సెలవా మరి! యద్దనపూడి సులోచనారాణి