Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యలమంచిలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కన్నబాబు వైసీపీలో చేరనున్నారు. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాను గత ఎన్నికల్లో యలమంచిలిలో టీడీపీ విజయం కోసం తీవ్రంగా కృషి చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించానని చెప్పారు. కానీ టీడీపీ మాత్రం తనను చాలా చిన్నచూపు చూసిందని, అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే తనను నమ్మించి మోసం చేశారని కన్న బాబు ఆరోపించారు. అలాగే నారా లోకేశ్ కూడా హామీ ఇచ్చి దారణంగా మోసం చేశారన్నారు. 5వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నానని చెప్పారు. తన నిర్ణయంలో మార్పు ఉండదని, భగవంతుడు చెప్పినా తాను వినబోనని చెప్పారు.
వైసిపిలో చేరాక ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రాకున్నా యలమంచిలి, పాయకరావుపేటలో వైకాపా గెలుపే లక్ష్యంగా పని చేస్తానని కన్నబాబు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో యలమంచిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన కన్నబాబు విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ మంత్రి కొణతాల టైం లో తన హవా సాగించారు. తదనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ని వీడి టిడిపిలో చేరారు. టిడిపిలో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ఆశించారు. అదీ జరగక పోవడం ఇప్పుడు యలమంచిలి నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆశావాహుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఇక తనకు అవకాశం లభించడం దుర్లభమనే ఆలోచనతో ఆయన టిడిపిని వీడుతున్నట్లు తెలుస్తోంది.