ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టిన క్రికెటర్ యశ్వసి జైస్వాల్

ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టిన క్రికెటర్ యశ్వసి జైస్వాల్

17ఏళ్ళ ముంబై క్రికెటర్ యశ్వసి జైస్వాల్ తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టాడు. 20లక్షల బేస్ ప్రైస్ తో వేలం లోకి వచ్చిన యశస్వి జైస్వాల్ .. 2.40 కోట్లకు అమ్ముడైయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ క్రికెటర్ ను దక్కించుకుంది. దాంతో జైస్వాల్ ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయ్యాడు. అయితే ఇదంతా ఏదో అదృష్టం కొద్దీ జరిగిపోలేదు. దీని వెనుకాల జైస్వాల్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకోవడం కోసం 9ఏళ్ళ వయసులోనే అతను ఉత్తరప్రదేశ్ నుండి ముంబై కి వచ్చాడు.

ఉండటానికి ఇల్లు లేకపోవడం తో గ్రౌండ్స్ మెన్ తో కలిసి ముస్లిం యునైటెడ్ క్లబ్ అనే ఓ టెంట్ లో ఉండేవాడు. ఇది ముంబై జింఖానా గ్రౌండ్ పక్కనే ఉండేది. దాంతో గ్రౌండ్ లో సాధన చేయడానికి జైస్వాల్ కు మంచి అవకాశం దొరికింది. ఇక బ్రతకడానికి జైస్వాల్ రోడ్ల మీద పానీపూరి అమ్మేవాడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఏనాడూ క్రికెట్ ను ఒదిలిపెట్టలేదు. అలా జూనియర్ లెవల్ క్రికెట్ లో రాణించడం తో మెల్లిగా ముంబై రంజీ టీంలో వచ్చి పడ్డాడు.

ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ లో ముంబై జట్టు తరుపున బరిలోకి దిగాడు యశస్వి జైస్వాల్. ఇక్కడే అతని సుడి తిరిగింది. జార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో 154 బంతుల్లో 17ఫోర్లు , 12 సిక్సర్ల సహాయం తో 203పరుగులు చేశాడు. ఫలితంగా లిస్ట్ ఏ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన పిన్నవయస్కుడిగా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. దాంతో జైస్వాల్ పేరు మార్మోగింది. దాంతో ఐపీఎల్ ప్రాంఛైజీలు ఎలాగైనా ఈ యంగ్ ట్యాలెంటెడ్ బ్యాట్స్ మెన్ ను దక్కించుకోవాలని భావించాయి. ఇక ఇప్పుడు తాజాగా జరిగిన వేలంలో భారీ మొత్తానికి అమ్ముడై జైస్వాల్ శభాష్ అనిపించుకున్నాడు.