Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వచ్చే నెలలో పాదయాత్ర తలపెట్టిన వైసీపీ అధినేత జగన్ ముందుగా ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆశీస్సులు తీసుకున్నాడన్న వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఇదే రామోజీ, ఇదే ఈనాడు మీద జగన్ సారధ్యంలోని సాక్షి పత్రిక ఏ పాటి యుద్ధం చేసిందో చూసాం. అయినా ఇప్పుడు పాదయత్రకి ముందు కావాలని రామోజీ ఆశీస్సులు తీసుకోవడం, ఈనాడులో కవరేజ్ ఇవ్వాలని కోరుకోవడం చూస్తుంటే వైసీపీ శ్రేణులకు నచ్చడం లేదు. ఒకప్పుడు తమకి సాక్షి ద్వారా రామోజీ వ్యతిరేకత నూరిపోసిన జగన్ ఇప్పుడు ఆయన్ని కలిసేందుకు వెళ్లడం వాళ్లకి రుచించడం లేదు. అయినా ఆలా వెళ్లడం వెనుక జగన్ కి వున్న రాజకీయ అవసరాలు అలాంటివి. రాజకీయ అవసరాలు పక్కనబెడితే సాక్షి యజమానిగా జగన్ ఆ పత్రిక మీద నమ్మకం కోల్పోయాడని అనిపిస్తోంది.
అప్పుడు కాంగ్రెస్ లో వున్నప్పుడు అయినా, ఆపై వైసీపీ ఏర్పాటు చేసినా జగన్ తీసుకున్న చాలా నిర్ణయాల్లో వెనుక సాక్షి ఉందన్న భరోసా ఉండేది. ఇప్పుడు ఆ పత్రిక వున్నా పాదయాత్ర కవరేజ్ విస్తృతంగా చేసే అవకాశం వున్నా ఈనాడు సాయం కోసం అర్ధించడంలోనే జగన్ మనసులో ఏముందో అర్ధం అవుతుంది. జర్నలిజం లో విలువలు సాక్షి తో పడిపోయాయని చెప్పలేకపోయినా అంతకుముందున్న మొహమాటాలు చెరిగిపోయాయి అని చెప్పుకోక తప్పదు. అయితే అధికారంలో వుంది కాబట్టి ఏకపక్ష రాతలు రాసినా చెల్లుబాటు అయ్యింది. అప్పట్లో ఓ టీడీపీ ఎమ్మెల్యే కి చెందిన నర్సింగ్ కాలేజీ లో మర్డర్ జరిగిందని ఓ తప్పు వార్త సాక్షిలో వచ్చింది. అయితే దాన్ని నిజం చేయడానికి సదరు ఎమ్మెల్యే మీద కేసు కోసం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఎంతగా చెలరేగిపోయాయో. అయితే అధికారం పోయాక 2014 లో ఓటమి తర్వాత సాక్షి ఎడిటోరియల్ బోర్డు కి పెద్ద సవాల్ ఎదురైంది. ఎప్పటిలాగా ఏకపక్షంగా నడపడమా లేక నిష్పాక్షిక ముద్ర తీసుకురావడమా అని. ఆ పత్రిక పెట్టిందే తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాదన వినిపించుకోవడం కోసం. కానీ ఆ రాతల్ని జనం నమ్మడం లేదని తెలిసి రూట్ మార్చుకుందామని చూసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అది కూడా జగన్ కి అర్ధం అయిపోయింది. జగన్ దృష్టిలో సాక్షి ఇప్పుడు పేల్చిచేసిన టపాకాయ. అందుకే పాదయాత్ర టైం లో రామోజీ ఆశీస్సులు, ఈనాడు కవరేజ్ కావాల్సి వచ్చాయి.