పాత ఇసుక విధానం రద్దు మీద టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారును విమర్సించారు. బాధ్యతగా మెలగాల్సిన స్థానంలో ఉండి, ఇష్టంవచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానాల గురించి ఆలోచించాల్సింది ఎవరు? అంటూ ట్విట్టర్ లో నిలదీశారు.
ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రజల సొంతింటి కలలు కడతేరిపోయాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ.10,000 అంటే వైసీపీ నేతలను మేపడానికేగా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, మొండిగా నిర్ణయాలు తీసేసుకోవడమేనా? పర్యవసానాలు ఆలోచించక్కరలేదా? ఇసుక కొరత మూలంగా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రజల సొంతింటి కలలు కడతేరిపోయాయి. ట్రాక్టర్ ఇసుక రూ.10,000లు అంటే వైసీపీ నేతలను మేపడానికేగా ఇదంతా?
— N Chandrababu Naidu (@ncbn) August 6, 2019
అయినా, వ్యవస్థలో మార్పు తేవాలంటే ముందు నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసుకోవాలని, సాధ్యమవుతుందో లేదో అంచనా వేసి ఆపై పాత వ్యవస్థను రద్దు చేయాలని హితవు పలికారు. అలాకాకుండా, రావడంతోనే పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి, కొత్త విధానం ఎప్పుడో వస్తుందంటూ పిల్ల ఆటలు ఆడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.