ఈరోజు వైసీపీ శాశన సభా పక్ష సమావేశం…మంత్రివర్గం మీద క్లారిటీ

rain blessings for ministers oath ceremony

విభజిత ఏపీకి రెండో ముఖ్యమంత్రిగా మే 30న బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కూర్పుపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు జూన్ 8 తేదీ ముహూర్తంగా నిర్ణయించడంతో కసరత్తుపై దాదాపు కొలిక్కివచ్చినట్టు సమాచారం. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారని, ఇందులో 45 శాతం వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే అవకాశం దక్కొచ్చని అంటున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగే భేటీలోనే మంత్రుల పేర్లను సీఎం జగన్ వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. క్యాబినెట్‌లో ఎవరెవరిని ఎందుకు తీసుకున్నామనే విషయాన్ని ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. సామాజికవర్గాలు, ప్రాంతాలు, రాజకీయ పరిస్థితుల ఆధారంగానే క్యాబినెట్ సభ్యులను ఎంపిక చేసినట్లు ఆయన వారికి విశదీకరిస్తారు.  గురువారం కొందరు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని, వెంటనే బయల్దేరి రాజధానికి రావాలని సమాచారం పంపినట్టు ప్రచారం జరిగింది. అయితే శుక్రవారం జరగబోయే వైసీపీఎల్పీ భేటీకి రావాలని మాత్రమే పార్టీ అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేలకు సమాచారం అందిందని తేలింది. ఇక, క్యాబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటివరకూ సీనియర్‌ నేతలతో కూడా చర్చించలేదని, జాబితా మొత్తం పూర్తిగా ఆయనే సిద్ధం చేసుకుంటున్నారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, గురువారం సాయంత్రం మాత్రం కొందరు సీనియర్‌ నేతలను అందుబాటులో ఉండాలని జగన్‌ ఆదేశించినట్టు సమాచారం. దీంతో కొందరు నేతలు హడావుడిగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కానీ, వారితో మంత్రివర్గ జాబితాపై సీఎం చర్చించారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు.