కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయలు దేరడంతో రాష్ట్రంలో మరోసారి నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. కుమారుడు విజయేంద్రతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో యడియూరప్ప ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీలో ఏడాది నుంచి అసమ్మతి సెగలు రేగుతున్నాయి. యడియూరప్ప వ్యతిరేకులు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
రెండు వారాల కిందట కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి అరుణ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించి ఎమ్మెల్యేలను కలిసి వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా యడియూరప్ప పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. నాయకత్వ మార్పు ప్రసక్తేలేదని, యడియూరప్ప పనితీరుపై అధిష్ఠానం సంతృప్తిగా ఉందని స్పష్టం చేశారు. కానీ, ప్రత్యర్ధి వర్గం మాత్రం యడ్డీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మంత్రుల శాఖలో సీఎం కుమారుడి జోక్యం ఎక్కువయ్యిందని ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇదిలా ఉండగా నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి యడియూరప్ప ఢిల్లీకి వెళ్లడం సాధారణమేనని, కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండబోదని అన్నారు. సీఎంగానే పూర్తికాలం యడియూరప్ప కొనసాగుతారని తెలిపారు. అంతేకాదు, మంత్రివర్గ పునర్-వ్యవస్థీకరణపై జరుగుతున్న ఊహాగానాలను తోసిపుచ్చారు. అటువంటిదేమీ లేదని, భవిష్యత్తులోనూ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్యాబినేట్ కొనసాగుతుందన్నారు.
‘ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ముఖ్యంగా జలవనరుల శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలుసుకుంటారు.. అందుకే సీఎం ఢిల్లీకి వెళ్లారు’ అని తెలిపారు.
కావేరీ నదిపై మేకేదాతు వద్ద కొత్తగా ప్రాజెక్టు నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంపై తమిళనాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దశాబ్దాలుగా కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. కొత్తగా మేకేదాతు ప్రాజెక్టు తెరపైకి రావడంతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరి పాకాన పడింది.