యువతిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం చేశాడు. కంప్యూటర్ క్లాసులకు వెళ్తున్న యువతిని వెంబడించి, పొదల్లోకి లాక్కెళ్లిన నిందితుడు.. ఆమె తలపై రాయితో మోది.. చేతులు వెనక్కు విరిచి చున్నీతో కట్టేయడానికి ప్రయత్నించాడు. అతడిని ప్రతిఘంటించిన యువతి.. సమీపంలోని ఇంటికి వెళ్లి తప్పించుకుంది. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. జనసమ్మర్దం అంతగా లేని ప్రాంతం కావడంతో ఒంటరిగా యువతి వెళ్తుండటంతో బాలుడు అత్యాచారానికి ప్రయత్నించాడు.
ఈ ఘటనపై మలప్పురం ఎస్పీ సుజీత్ దాస్ మాట్లాడుతూ.. బాధిత యువతి కంప్యూటర్ క్లాసులకు వెళ్తుండగా.. మైనర్ బాలుడు అత్యాచారయత్నం చేశాడు. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అతడు.. యువతిని రోడ్డుపక్కనే ఉన్న పొదల్లోకి ఈడ్చుకెళ్లాడు. అనంతరం తలపై రాయితో కొట్టి చేతులను వెనక్కుకట్టేయడానికి ప్రయత్నించగా.. ఆమె ప్రతిఘటించి తప్పించుకుంది. జనాలు అంతగా లేని ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నిందితుడు దానిని అలుసుగా తీసుకున్నాడని పేర్కొన్నారు.
నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని వైద్య పరీక్షల కోసం జువైనల్ హోమ్‌కి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలితో వివరంగా మాట్లాడాం.. దాడి చేసిన వ్యక్తి గురించి వివరించింది.. మా నిఘా, నెట్‌వర్క్ సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నాం.. నిందితుడితో బాధిత యువతికి పరిచయం లేదు’ అని పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
దాడిలో గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు షాక్ నుంచి తేరుకోడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.మరోవైపు, యువతి ప్రతిఘటించడంతో నిందితుడికి గాయాలయ్యాయి. ఈ గాయాలు గురించి తల్లిదండ్రులు ఆరాతీయగా.. ఓ కుక్కు వెంబడించినట్టు అబద్దం చెప్పాడు. చివరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువతిపై అత్యాచారయత్నం చేసింది అతడేనని పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఇంటికి సమీపంలో ఉండే వ్యక్తిగా తేలింది.