హత్రాస్ జిల్లాలో అత్యాచారానికి గురై 19 ఏళ్ల దళిత యువతి అన్యాయంగా తనువు చాలించిన అమానుష ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల దళిత బాలికపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఇటుకలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… రాష్ట్రంలోని భడోహిలో గురువారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలంలోకి వెళ్లిన 14 ఏళ్ల బాలిక ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె సోదరుడు బాలిక కోసం వెతకగా పోలాల్లో హత్యకు గురైన తన సోదరి మృతదేహాన్నిగుర్తించాడు.
ఈ విషయం కేసు నమోదిన పోలీసులు ఆ బాలికపై లైంగికదాడి చేసి ఇటుకలతో, రాళ్లతో కొట్టి చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది ఎవరో ఇంకా తెలియలేదని అయితే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూర్తి విషయాలు తెలుస్తాయని చెప్పారు. మరోవైపు అదే రాష్ట్రంలోని హత్రాస్‌లో దళిత యువతి ఘటనపై ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో మరో దళిత బాలికపై హత్యాచారం ఘటన వెలుగుచూడటం కలకలం రేపుతోంది.