ప్రేమ వ్యవహారం ఓ యువకుడి హత్యకు దారితీసింది. సీఐ శ్రీను కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధి లోని వెంకట్రావ్‌పేటకు చెందిన గోపి (26), అదే కాలనీకి చెందిన బెదుగం నరేందర్ (35) సోదరుని కూతురును ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతనిపై కేసు నమోదైంది. అయినప్పటికీ గోపి వైఖరిలో మార్పు రాకపోవడంతో నరేందర్ సోదరుని కుటుంబం వెంకట్రావ్పేట నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ యువతితో తనకు వివాహం జరిపించాలని స్థానికంగా ఉంటున్న నరేందర్‌ను గోపి తరచూ వేధిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న గోపి, నరేందర్ ఇంటికెళ్లి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా.. నరేందర్ మొదట కత్తెరతో ఆ తర్వాత గొడ్డలి తో గోపిపై దాడి చేయగా అతను ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీను, ఎస్సై సధాకర్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యువతిని వేధించిన కేసుతోపాటు మరో రెండు దొంగతనాల కేసుల్లో గోపి నిందితుడని పేర్కొన్నారు. కాగా నరేందర్ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది.