మనస్తాపంతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు, యువకుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఐడీఏ జీడిమెట్లలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌కు చెందిన బయోరా శ్యామ్‌సింగ్, సరస్వతి దంపతుల కుమారుడు ప్రేమ్ సింగ్ జేఎన్‌టీయూ దగ్గరలో ఉన్న ఎంఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కాగా ప్రేమ్‌సింగ్ సోదరిని ధన్వాడకు ఇచ్చి వివాహం చేశారు. గత కొన్ని రోజుల క్రితం సోదరి ఇంటిలో విందుకు వెళ్లిన ప్రేమ్‌సింగ్ సోదరి ఇంటి పక్కన ఉండే యువతిని చూసి ప్రేమలో పడ్డాడు.
సదరు యువతి ఫోన్ నెంబర్ తీసుకుని ప్రపోజ్ చేయగా ఆమె తిరస్కరించింది. దీంతో సైకోలా మారిన ప్రేమ్‌సింగ్ సదరు యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడికి పాల్పడగా ఆమె కుంటుంబ సభ్యులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ప్రేమ్‌సింగ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి ప్రేమ్ సింగ్ ఎక్కువ సేపు తన బెడ్‌రూంలోనే గడుపుతున్నాడు.
ఈ నెల 27వ తేదీ శనివారం తన బెడ్‌రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. కుమారుడు రెండు రోజులైనా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రేమ్‌సింగ్ తల్లి 29వ తేదీన తలుపు తట్టింది. ఎంతకూ తీయకపోవడంతో అనుమానం వచ్చి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు విరగొట్టి చూడగా ప్రేమ్‌సింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.