పులితో పోరాడిన యువకుడు

పులితో పోరాడిన యువకుడు

తనకు జీవనోపాధి కల్పిస్తున్న వాటిని కాపాడుకునేందుకు ఓ యువకుడు ఏకంగా పులితో పోరాడాడు. దాడి చేసేందుకు వస్తున్న వ్యాఘ్రాన్ని ఏమాత్రం బెరుకు లేకుండా పోరాడి చివరకు అంతమొందించాడు. అతడి సాహసం.. తెగువను గ్రామస్తులు మెచ్చుకున్నారు. అయితే పులిని హతమార్చడంతో కేసుల బారిన పడే అవకాశం ఉంది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. పితోర్‌గడ్‌ జిల్లా నైని గ్రామానికి చెందిన మేకల కాపరి నరేశ్‌ సింగ్‌. మేకలను మేపుతూ జీవిస్తున్నాడు.

రోజు మాదిరిగా బుధవారం మేకలను మేత కోసం అడవి బాట పట్టాడు. మేత మేస్తున్న మేకల మందలో అలజడి మొదలైంది. ప్రాణభయంతో మేకలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఏమైందా అని వెళ్లి చూడగా చిరుత పులి ప్రత్యక్షమైంది. తన మేకలను కాపాడుకునేందుకు నరేశ్‌ విశ్వ ప్రయత్నాలు చేశాడు. బెదిరించాడు.. వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్న నరేశ్‌పైకి పులి దూసుకొచ్చింది. తన మీదకు దాడి చేసేందుకు వచ్చిన పులిపై కొడవలితో ఒక్క వేటు వేశాడు. అతడి దెబ్బకు పులి నేలకొరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పులి కళేబరాన్ని పరిశీలించారు. అయితే పులిని హతమార్చడం వాస్తవంగా నేరం. కాకపోతే ఆత్మరక్షణ కోసం చంపడంతో నరేశ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే నరేశ్‌ తెగువను గ్రామస్తులు అభినందించారు. తమకు పొంచి ఉన్న పులి ముప్పును తప్పించాడని ప్రశంసించారు.