ఆమె మొండెం నుంచి తలను వేరు చేసి…

ఆమె మొండెం నుంచి తలను వేరు చేసి...

ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో ఓ యువకుడు వృద్ధురాలిని పాశవికంగా హతమార్చాడు. అనంతరం ఆమె మొండెం నుంచి తలను వేరు చేసి.. దాంతో పోలీస్‌ స్టేషనులో లొంగిపోయాడు. వివరాలు.. ఛతారా గ్రామానికి చెందిన కార్తిక్‌ కెరాయి అనే యువకుడి కజిన్‌ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం పాలయ్యాడు. దాంతో అతడిని నందిని పుత్రి అనే వృద్ధురాలి దగ్గరకు తీసుకువెళ్లాడు. మంత్రాలతో రోగాలు నయాలు చేస్తుందని స్థానికంగా పేరున్న ఆమెను తన కజిన్‌ ఆరోగ్యాన్ని బాగుచేయమని కోరాడు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించడంతో వారిద్దరు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు.

అయితే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కెరాయి కజిన్‌ ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే అతడిని కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ జూలై మొదటి వారంలో సదరు వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో తన కజిన్‌ చావుకు నందిని మంత్ర ప్రయోగమే కారణమని భావించిన కెరాయి బుధవారం రాత్రి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. తల నరికి ఉన్మాదిలా ప్రవర్తించాడు. అనంతరం ఆమె తల చేతిలో పట్టుకుని దనగాడి పోలీస్‌ స్టేషనులో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు గురువారం వెల్లడించారు.