ఆంధ్రప్రదేశ్ లో ఈ లాక్ డౌన్ వేళ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతిలో దారుణం జరిగింది. ఈ లాక్డౌన్ సమయంలో బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నించిన వృద్ధురాలిపై కత్తితో దాడి చేశారు కొందరు యువకులు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద ఆరుగురు యువకులు రోడ్లపై తిరుగుతున్నారు. ఆ పక్కనే షాప్ నడుపుతున్న వృద్ధురాలు వారిని ప్రశ్నించింది. కరోనా ఉంది ఎందుకు బయటకు వచ్చారని అడిగింది. అంతా ఇళ్లకు వెళ్లిపోండని చెప్పింది. యువకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీసులకు సమాచారం అందించింది. తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆకతాయిగా తిరుగుతున్న ఆరుగుర్ని మందలించి ఇంటికి పంపించి వేశారు.
అయితే ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన వృద్ధురాలిపై ఆ యువకులు పగ బట్టారు. పోలీసులు వెళ్లిపోయిన కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన యువకులు కత్తులతో రోడ్డుపై హంగామా సృష్టించారు. వృద్ధురాలి షాపులో వస్తువుల్ని ధ్వంసం చేసి.. కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డారు. ఇంతలో ఆమె కుమారుడు వచ్చి అడ్డుకున్నాడు. అయితే అడ్డుకున్న అతడిపై కూడా యువకులు దాడి చేశారు. ఇద్దరికి స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఆ యువకులు రోడ్లపై కత్తులతో తిరిగే సీన్ మొత్తం పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఓవైపు లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో యువకులు ఇలా రోడ్లపై కత్తులతో తిరగడం సంచలనంగా మారింది.