ఆయన పొలం యాజమాని. ఆ పొలంలోనే ఓ యువతి వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. ఇరువురు ఇష్టపడ్డారు. ఏడాది పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన యువకుడు మొహం చాటేశాడు. దీంతో నన్నే మోసం చేస్తావా అంటూ యువతి బంధువుల ఎదుటే ప్రియుడికి బడితపూజ చేసింది. వివరాలు.. కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన శేఖర్, పెద్దటేకూరు గ్రామానికి చెందిన మునీ మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది.
తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరగా కుటుంబసభ్యులు వద్దంటున్నారని శేఖర్ బదులిచ్చాడు.యువతి వినకపోవడంతో పెద్దలందరూ పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టారు. సదరు యువతి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. నాకు కేసు వద్దు అతనితో పెళ్లి జరిపించాలని యువతి కోరగా శేఖర్ ససేమిరా అన్నాడు. ఇదిలాఉండగా ఇటీవల యువతి ప్రియుడికి ఫోన్ చేసి పిలింపించుకుని తెలంగాణలోని బంధువుల ఊరికి తీసుకెళింది.
ఆ ఊరిలో దేవాలయం ముందు పెద్దల సమక్షంలోనే తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ నిరాకరించిన ప్రియుడిని కర్రతో చితక బాదింది. ఈ ఘటన అక్కడున్న వారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది. ఇదిలాఉండగా సదరు యువతి ప్రేమ విషయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.