కొద్ది రోజుల్లో పెళ్లి భాజా మోగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఫరీదుపేట గ్రామానికి చెందిన కవితకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే అదే గ్రామానికి చెందిన వివాహితుడైన గోదూరి ప్రవీణ్ అనే వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానంటూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఈ విషయమై గతంలో గ్రామంలో పంచాయితీ నిర్వహించి జరిమానా సైతం విధించారు. అయినా అతడి బుద్ధి మారలేదు.
పెళ్లి చెడగొట్టాలన్న దురుద్దేశంతో ఆ యువతికి కాబోయే భర్తకు ఫోన్ చేశాడు. తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బహిర్భూమికని వెళ్లి గ్రామశివారులోని బండారి చెరువు కాలువ వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు గోదూరి ప్రవీణ్ కారణమని యువతి తండ్రి ఎల్లయ్య, తల్లి మణెవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.