ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం మండలంలోని బండనాగారంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి దివ్యకు మండలంలోని బండనాగారానికి చెందిన షాదుల్లాబాబాతో రాంగ్ నంబర్ ఫోన్‌కాల్‌తో పరిచయమై తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వారిద్దరూ కలిసి ఘట్కేసర్లో ఓ రూంలో సహజీవనం చేశారు. కొన్నాళ్లు సజావుగా ఉన్నారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి.
అయితే దివ్య వారు ఉంటున్న ఏరియా ఘట్కేసర్ పీఎస్‌లో రేప్ చేశాడని ఫిర్యాదు చేయడంతో షాదుల్లాబాబా జైలుకు వెళ్లాడు. అనంతరం ఆయనకు దివ్యనే బెయిల్ ఇప్పించి విడుదల చేయించింది. మళ్లీ కాపురంలో గొడవలు రావడంతో బాబా బండనాగారం రాగా భార్య దివ్య వచ్చి గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులకు ఫోన్ చేయగా ఘటనా స్థలానికి వచ్చి దివ్యకు వైద్యం చేయించి వీరి ఇరువురిని ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు.