మండలంలోని సంధిగూడ గ్రామంలో యువతి మండంగి సంధ్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెది హత్యా? ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై ఎల్విన్‌పేట సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్సై షన్ముఖరాజు బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం గొహిది గ్రామానికి చెందిన సంధ్యకు గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీ సంధిగూడ గ్రామానికి చెందిన ఆరిక లక్ష్మణ్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది.
పరిచయం ప్రేమగా మారడంతో సుమారు నాలుగుసార్లు లక్ష్మణ్ ఇంటికి సంధ్య వచ్చి వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో కూడా లక్ష్మణ్ ఇంటికి ఆమె రాగా వారిద్దరి మధ్య కొద్దిపాటి గొడవ జరగడంతో మనస్తాపానికి గురై లక్ష్మణ్‌కు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ పట్టుకుని స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇటీవల పలు పోస్టులకు ప్రకటనలు రావడంతో దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికెట్లు అవసరమై సంధ్యకు ఫోన్ చేసి ఇవ్వాల్సిందిగా లక్ష్మణ్ కోరినప్పటికీ నిరాకరించింది. దీంతో గొహిది సర్పంచ్‌కు లక్ష్మణ్ ఫోన్ చేసి తన సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరాడు. ఈ మేరకు సర్పంచ్ ఆమెతో మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించాడు.
ఇదిలా ఉండగా లక్ష్మణ్ జనవరి 28న పనిమీద విశాఖ జిల్లా పెందుర్తి వెళ్లిన సమయంలో సంధ్య మళ్లీ సంధిగూడ వచ్చింది. ఏం జరిగిందో ఏమో గానీ మంగళవారం రాత్రి సంధిగూడ గ్రామానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న చింతచెట్టుకు ఆమె వేలాడుతూ కనిపించింది. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి, పరిశీలించి శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.