ప్రమాదవశాత్తు ఓ యువతి బ్లేడును మింగగా, ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తకుండా విజయవంతంగా బ్లేడు తీసి చికిత్స అందించామని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గత నెల 29న ఓ యువతి ప్రమాదవశాత్తు బ్లేడును మింగిందన్నారు.
కుటుంబసభ్యులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకురాగా, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు 30న ఎండోస్కోపి ద్వారా బ్లేడు ముక్కను తీసి వేశారన్నారు.అనంతరం ఆమెకు ఎక్స్‌రే తీయగా మరో ముక్క బ్లేడు ఉన్నట్లు గుర్తించి 31న మరోమారు దానిని తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందన్నారు. క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా నిర్వహించిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యుల బృందాన్ని అభినందించారు.