ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కేసులో అసలు దొంగలను పట్టుకోకుండా అన్యాయంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఓ యువకుడు సెల్పీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మండలంలోని తక్కళ్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… తక్కళ్లపల్లి పరిధిలోని కొత్తగూడలో ఇటీవల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి.
దీంతో రెబ్బెన పోలీసులు దర్యాప్తులో భాగంగా గతంలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనం కేసులో సంబంధం ఉన్న పుప్పాల అంజితో పాటు మరో ముగ్గురిని అనుమానితులుగా భావించి పోలీస్‌స్టేషన్‌కు రప్పించి విచారణ అనంతరం తిరిగి ఇంటికి పంపించారు. సోమవారం సైతం మరోసారి స్టేషన్‌కు రావాలని చెప్పడంతో తనను దొంగతనం కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తక్కళ్లపల్లి రైల్వేగేట్ సమీపంలో సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగాడు.
ఆ వీడియోను వాట్సప్ గ్రూప్‌లో పోస్టు చేయటంతో గమనించిన స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అంజిని బెల్లంపల్లిలోని ఆస్పత్రికి తరలించారు.మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ఈ విషయమై రెబ్బెన ఎస్సై భవానీసేన్‌ను వివరణ కోరగా అంజికి గతంలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనం చేసిన నేర చరిత్ర ఉండడంతో అనుమానంతో పోలీస్‌స్టేషన్‌కు పిలింపించి విచారించి వదిలేశాం. అంతకు మించి మాకు సంబంధం లేదు. పురుగుల మందు తాగిన అంజితోనూ మాట్లాడాను అని ఎస్సై తెలిపాడు.