బీటెక్ చదివినా ఉద్యోగం రావడం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగిన నిరుద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పాల్వంచ మండలం పాండురంగాపురానికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు – శివరాణి దంపతుల కుమారుడు అజయ్‌కుమార్ బీటెక్ పూర్తిచేశాడు. ఆ తర్వాత ఏపీలోని వైజాగ్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసినా నెల రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు.
అయితే, తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని కొన్నాళ్లుగా ఆవేదన చెందుతున్న ఆయన, గత నెల 20న పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగగా, కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాగా, ఉద్యోగం రావడం లేదనే ఆవేదనతోనే అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి మేనమామ ఎం.కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.సుమన్ తెలిపారు.