కేంద్రం మద్దతు లేకుండా మండలిని రద్దు చేయడం అసాధ్యం

కేంద్రం మద్దతు లేకుండా మండలిని రద్దు చేయడం అసాధ్యం

మండలి రద్దు వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందన్న ప్రచారాన్ని .. ఆ పార్టీ శ్రేణులు చేసుకుంటున్నాయి. కేంద్రం మద్దతు లేకుండా మండలిని రద్దు చేయడం అసాధ్యం. ఎందుకంటే.. ఇప్పటికే.. ఇలాంటి బిల్లులు మూడు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన.. కేంద్రం బాధ్యత తీసుకోదు. దానికో లెక్క ఉంటుంది. అలాంటి బిల్లులను ఓ వరుస క్రమంలో పార్లమెట్‌కు పంపుతారు. అక్కడ ఆమోదిస్తే ఆమోదిస్తారు లేకపోతే లేదు. ఆమోదించాలంటే.. కచ్చితంగా.. కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరం. బీజేపీ వ్యతిరేకిస్తే.. ఆ బిల్లు బయటకు రాదు. సభలకు వెళ్లిన తిరస్కరణకు గురై వెనక్కి వస్తుంది.

రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయం ప్రకారం.. శాసనమండలి రద్దు చేయడానికి బీజేపీ వ్యతిరేకం. ఏపీలో బీజేపీకి ఎమ్మెల్యేలు లేరు. టీడీపీతో పొత్తు పుణ్యమా అని.. ఇద్దరు ఎమ్మెల్సీలు బీజేపీకి వచ్చారు. ఎమ్మెల్యేల కోటాలో సోము వీర్రాజు, పట్టభద్రుల ఎన్నికల్లో మాధవ్ .. టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. ఏపీలో బీజేపీకి చట్టసభల్లో ఉన్న ప్రాతినిధ్యం వీరిద్దరు మాత్రమే. వీరిని కూడా.. లేకుండా చేసుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉండకపోవచ్చు. అదే సమయంలో.. మండలి రద్దు పూర్తిగా.. వైసీపీ రాజకీయ అవసరాల కోసం.. తీసుకుంటున్న నిర్ణయం.

వైసీపీ రాజకీయ అవసరాల కోసం.. తాము సీరియస్‌గా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని.. బీజేపీ నేతలు కూడా అనుకోవడం లేదు. అయితే.. రాష్ట్రంలో తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం కేంద్రానికి చెప్పే చేస్తున్నామన్న వైసీపీ వాదనలను పరిశీలిస్తే.. మండలి నిర్ణయం కూడా.. ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే… ఉన్న పళంగా కాకపోయినా.. కాస్త వేగంగానే మండలి రద్దు బిల్లు.. పార్లమెంట్‌కు చేరే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీ – వైసీపీ మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఇప్పటికీ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాలు రాష్ట్ర బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు మరింత ఇబ్బందికరం అవుతాయి. ఈ విషయంలో కేంద్రం స్పందన ఏమిటో తెలియాల్సి ఉంది.