కోరింది దక్కేలా వుంది…అయినా జగన్ కి భయం.

YS Jagan Fearing With 2018 Advance Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎవరికి అయినా కోరిన కోరిక తీరకపోతే బాధ తీరుతుంటే సంతోషం కలుగుతాయి. కానీ వైసీపీ అధినేత జగన్ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. 2014 ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని జగన్ కొన్ని నెలల కాలం గడవగానే ఈ సర్కార్ ఏడాదికి మించి ఉండదు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటూ ఘనంగా ప్రకటించారు. ఓ విధంగా చెప్పాలంటే చంద్రబాబు సర్కార్ ని గద్దె దించడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని తహతహలాడారు. ప్రతి సభలోనూ ఈ సర్కార్ పడిపోతుందని చెప్పి చెప్పి అధికార పార్టీ కి చిరాకు తెప్పించారు. ఓ దశలో నేను తలచుకుంటే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు వుండలేదంటూ సీఎం చంద్రబాబు ని ఆపరేషన్ ఆకర్ష్ కి దిగేలా రెచ్చగొట్టారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది అనుకోండి. ఓ 20 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై కొట్టాక కానీ జగన్ కి తత్వం బోధపడలేదు. అప్పటికీ ప్రభుత్వం పడిపోతుందన్న మాట వదిలిపెట్టారు గానీ ఎన్నికలు ఎంత త్వరగా జరుగుతాయా అన్న ఆత్రం వదిలిపెట్టలేదు.

సీఎం చంద్రబాబు ఓ దశలో జమిలి ఎన్నికల కోసం కొంత త్యాగానికైనా సిద్ధం అనగానే జగన్ ఇక ఎన్నికలు వచ్చినంతగా సంబరపడడం అందరం చూసాం. ఇక కేంద్ర ప్రభుత్వం 6 నెలలు ముందుగా అంటే 2018 డిసెంబర్ లో సార్వత్రిక ఎన్నికలు జరపొచ్చని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే దాంతో పాటు ఏపీ, తెలంగాణ తో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఎన్నికలు ఎన్నికలు అని కలవరించిన జగన్ కి ఇప్పుడు అదే వ్యవహారం పెద్ద గుదిబండగా మారింది. నంద్యాల,కాకినాడ ఫలితాల తర్వాత ఎన్నికలు ఎంత లేట్ అయితే అంత మంచిది అన్న ధోరణికి వచ్చారట జగన్ . తన దగ్గరికి వచ్చే నాయకులతో ఆయన 2018 లో ఎన్నికలు రాకుంటే బాగుండు అన్న వ్యాఖ్యలు కూడా చేస్తున్నారట. కోరుకున్న ఎన్నికలు వస్తుంటే జగన్ భయపడే పరిస్థితి. కానీ జగన్ అర్ధం చేసుకోవాల్సింది ఒకటుంది. ఆయన కావాలి అనుకున్నప్పుడు ఎన్నికలు రావు, వద్దనుకుంటే ఆగవని. ఈ చిన్న విషయాన్ని కచ్చితంగా అర్ధం చేసుకుంటే కాలానికి తగినట్టు వ్యవహరించడం అలవాటు అవుతుంది.లేక కాల చక్రాన్ని మనకి అనుకూలంగా తిప్పాలి అనుకుంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఎదురు అవుతాయి.