ఆ 10 వేల ఓట్లు జగన్ కొంప ముంచుతాయా ?

Ys Jagan may be lost SC and Minority Votes

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్రమంగా ఎన్నికల ముఖచిత్రంగా ఆవిష్కృతం అవుతోంది. ఎన్నికల యుద్ధంలో కూటములు ఉంటాయా లేక పార్టీలే ఒంటరి పోరాటం చేస్తాయా అన్న విషయంలో క్లారిటీ లేకపోయినా ఎవరి రాజకీయ లక్ష్యం ఏమిటన్న సీన్ మాత్రం జనానికి అర్ధం అయ్యింది. వారు ఎటు మొగ్గుతారు, ఎవరి మాట నమ్ముతారు అన్న ఉత్కంఠ ని ఇంకాస్త పెంచుతూ విభజన దెబ్బ కి కుదేలైన కాంగ్రెస్ మళ్లీ సర్వశక్తులు కూడదీసుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో అస్తిత్వం నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. అదే అక్కడే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఏపీ వ్యవహారాల ఇంచార్జి గా నియమితులైన ఉమెన్ చాందీ ఇప్పటికే పార్టీకి దూరం అయిన పాత నాయకులని దగ్గరకు తీసుకునే పని మొదలు పెట్టారు. ఆ వరసలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సహా ఎంతోమంది నేతలు వున్నారు. వీరిని ఆకట్టుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ కి కనీసం 10 వేల నుంచి 50 వేల ఓట్లు సాధించాలన్న లక్ష్యం తో ఉమెన్ చాందీ అడుగులు వేస్తున్నారు. పార్టీ సానుభూతిపరుల్ని ఒక్క చోటుకి చేర్చే సత్తా వున్న స్థానిక నాయకత్వం కోసం కాంగ్రెస్ వెతుకుతోంది. ఇప్పటికే కొంత మందిని గుర్తించింది. వారిని పార్టీలో తీసుకొచ్చి క్రియాశీలం చేసేలా చర్యలు చేపట్టింది. ఈ పరిణామమే ఇప్పుడు వైసీపీ ని గజగజలాడిస్తోంది.

ఒకప్పుడు ఏపీ లో రెండు భుజాల వలే ఎస్సీలు, మైనార్టీలు కాంగ్రెస్ ని మోశారు. వైసీపీ ఏర్పాటు తర్వాత ఆ వర్గాల్లో చీలిక వచ్చి మెజారిటీ జగన్ వైపు వెళ్లారు. విభజన తర్వాత మిగిలిన కొద్దిమంది కూడా తమకు నచ్చిన పార్టీ వైపు వెళ్లారు. అయితే గడిచిన రెండేళ్లుగా వైసీపీ అధినేత జగన్ బీజేపీ వైపు అడుగులు వేస్తుండటాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వారిని దగ్గరకు తీయడానికి టీడీపీ కొన్ని ప్రయత్నాలు చేసినా అవి పాక్షిక ఫలితాలే ఇస్తున్నాయి. ఇంతలో కాంగ్రెస్ యాక్టివ్ కావడంతో ఆ పార్టీ సానుభూతిపరులు తిరిగి అటువైపు చూస్తున్నారు. అలా నియోజకవర్గానికి చీలే 10 వేల ఓట్లు వైసీపీ కి వచ్చేయే అని చెప్పుకోవచ్చు. కిందటి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ జరిగిన స్థానాలు 45. అందులో 29 లో 5 వేల లోపు మెజారిటీ తో వైసీపీ, 16 చోట్ల 5 వేల లోపు మెజారిటీతో టీడీపీ గెలుపొందాయి. అంటే ఈ 45 స్థానాల్లో 3 వేల ఓట్లు తారుమారు అయితేనే ఫలితాలు మారిపోతాయి. అలాంటిది కాంగ్రెస్, వైసీపీ ఓటు బ్యాంకు నుంచి 10 వేల ఓట్లు కొల్లగొడితే ఇంకేమైనా ఉందా ?