Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మరణించిన 22 ఏళ్ల తరువాత విచిత్రంగా ఎన్టీఆర్ అందరికీ తనపై సినిమా తీయమని ఆత్మ ప్రభోదం చేస్తున్నారు. మరణానికి ముందు చివరిరోజుల్లో ఆయన రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు అనుభవించారు.ఆయన మరణించిన సమయంలో…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత బతుకు బతికీ..అన్న సామెతను గుర్తుచేసుకున్నారు. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్నది నిజమైనా..మరణం వృద్ధాప్యంలో ప్రశాంత పరిస్థితుల మధ్య సంభవిస్తే..జీవితానికి పరిపూర్ణత దక్కినట్టు. సామాన్య కుటుంబంలో పుట్టి…ఊహకందని స్థాయికి ఎదిగి మేరునగధీరుడు అనిపించుకున్న ఎన్టీఆర్ కు మాత్రం చివరిమజిలీలో ప్రశాంతత దక్కలేదు. దాన్ని బట్టి చూస్తే ఆయనది అసహజమరణంగానే భావించాలి. వెండితెరవేల్పుగా, తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా వెలుగొందిన ఎన్టీఆర్ హృదయవిదారక పరిస్థితుల్లో మరణించినప్పుడు ఆంధ్రపద్రేశ్ తల్లడిల్లిపోయింది. ఆయన మరణవార్త విని అనేకమంది అభిమానులు గుండె పగిలి చనిపోయారు.
రాష్ట్రం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని సంగతుల్లానే క్రమంగా ఎన్టీఆర్ లేరన్న విషయాన్ని ప్రజలు అర్ధంచేసుకుని కొన్నాళ్లకు దైనందిన జీవితంలో మునిగిపోయారు. అయితే తన జీవితంతోనూ, మరణంతోనూ సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ గురించి ఓ సినిమాను తీయాలని అప్పుడెవరూ భావించలేదు. అలాగని అప్పుడు బయోపిక్ ట్రెండ్ లేదనుకోడానికీ వీల్లేదు. నిజ జీవిత ఘటనలు, కొందరు వ్యక్తుల వాస్తవ జీవితాల ఆధారంగా అప్పటికే చాలా సినిమాలు తెరకెక్కాయి కూడా. అయినా ఎవరూ ఎన్టీఆర్ పై సినిమా తీయాలని భావించలేదు. ఆయన మరణం తరువాత నాలుగేళ్లకు 1999లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా ఎన్టీఆర్ మరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఏ రాజకీయ పక్షమూ భావించలేదు. కానీ విచిత్రంగా ఇప్పుడు మాత్రం అధికార, ప్రతిపక్షాలు ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా రూపొందించి రాజకీయాల్లో గట్టెక్కాలని భావిస్తున్నాయి.
2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఎన్టీఆర్ చివరిరోజులను సినిమాగా మలిస్తే….తనకు లాభిస్తుందన్న వ్యూహరచన చేశారు. అలా వర్మ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటింపచేసి వైసీపీ వేసిన ఎత్తుకు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డితో లక్ష్మీస్ వీరగ్రంధం ప్రారంభించి టీడీపీ పై ఎత్తు వేసింది. రాజకీయ క్రీడలో భాగస్వామ్యులైన వర్మ, కేతిరెడ్డి కూడా పొలిటికల్ నేతలను మరిపించే తీరులో యాక్ట్ చేస్తున్నారు. దేవుడు ఎక్కడున్నాడు..ఆత్మ, పునర్జన్మలాంటివేమీ లేవని వాదించే వర్మ…లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటించిన తరువాత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆత్మ రోజూ తన కలలోకి వస్తోందని, సినిమా తీయమని ఆదేశంచింది ఆయన ఆత్మేనని, రోజూ తనతో స్క్రిప్టు కూడా రాయిస్తోందని హాస్యాస్పదంగా వ్యాఖ్యానించాడు. వర్మ అయితే సరదాగా ఈ వ్యాఖ్యలు చేశాడు కానీ…కేతిరెడ్డి అయితే సీరియస్ గానే ఈ మాటలు చెప్తున్నాడు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీస్ వీరగ్రంధం షూటింగ్ ప్రారంభించిన కేతిరెడ్డి…
అనుమతి లేదంటూ పోలీసులు చిత్రీకరణను అడ్డుకోవడంతో ఉద్వేగానికి గురయ్యాడు. ఎన్టీఆర్ ఆత్మ ప్రభోదం మేరకే తాను సినిమాను తీస్తున్నానని, తన సినిమాకు లక్ష్మీ పార్వతి స్వచ్చందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. లేని పక్షంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకూ వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం జరిపి లక్ష్మీపార్వతి నిజస్వరూపం బయటపెడతానని హెచ్చరించారు. సినిమా పూర్తయిన తరువాత లక్ష్మీ పార్వతికి ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టులో చూసుకోవాలని సూచించారు. మొత్తానికి లక్ష్మీపార్వతిని వైసీపీలో చేర్చుకున్న జగన్ ఆమె సాయంతో చంద్రబాబుకు షాకిద్దామని భావిస్తే..చంద్రబాబు లక్ష్మీస్ వీరగ్రంధం ప్రకటింపచేసి వారిద్దరిని డిఫెన్స్ లో పడేశారు.