Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు అనుకుంటాము. పదవులే కాదు పరపతి, ప్రతిష్ట కూడా అంతే. బొత్స, ధర్మాన… ఈ ఇద్దరూ ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వెలిగిపోయారు. ఇక తమ తమ సొంత జిల్లాల్లో అయితే కనుచూపుతో శాసించారు. వై.ఎస్ అండదండతో పదవులు పొందడమే కాదు ఉత్తరాంధ్ర లో తిరుగులేని పెత్తనం చేశారు. రాష్ట్ర విభజన టైం లో కుదిరితే సీఎం పీఠాన్ని కూడా ఎక్కాలని తహతహలాడారు. ఆ వూపులోనే వైసీపీ అధినేత జగన్ ని చిన్నపిల్లాడిని చేసి మాట్లాడారు. అయితే విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీ లో రాజకీయ సమాధి కావడంతో ఈ ఇద్దరూ రాజకీయ పునరావాసం కోసం మళ్లీ అదే జగన్ దగ్గర నుంచోవాల్సి వచ్చింది. ఈ ఇద్దరూ వైసీపీ లో చేరడమే ఆలస్యం పార్టీ లో ముందు నుంచి వున్నవారిని పక్కనబెట్టి మరీ దూసుకెళ్లారు.
బొత్స, ధర్మాన స్పీడ్ చూసి వైసీపీ అధినేత జగన్ కూడా లోలోన సంతోషపడిపోయారు. అయితే వారు అనుకున్నది ఒకటి. అయ్యింది ఇంకొకటి. కాంగ్రెస్ లో వున్నప్పుడు ఈ ఇద్దరి అణచివేత తట్టుకోలేక వైసీపీ కి వచ్చిన నేతలంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. అందుకే జగన్ ఎంత నచ్చజెప్పినా బొబ్బిలి రాజులు పార్టీకి గుడ్ బై కొట్టి టీడీపీ లో చేరి మంత్రి పదవి అందుకున్నారు. వైసీపీ నేతలే కాదు సామాన్య ప్రజలు కూడా ఈ ఇద్దరూ టీడీపీ సర్కార్ మీద రాజకీయ పోరాటం చేస్తుంటే గతంలో వారు చేసిన తప్పులు గుర్తుకి వచ్చి పెద్దగా స్పందించడం లేదట. దీంతో 2014 ఎన్నికలు అయిపోయి దాదాపు మూడున్నర ఏళ్ళు గడిచినా ఉత్తరాంధ్ర లో పార్టీ పరిస్థితి వీసమెత్తు కూడా మారలేదని సర్వేల్లో తేలిందట. అందుకు ప్రధాన కారణం బొత్స, ధర్మాన అంటూ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో జగన్ ఆలోచనలో పడ్డారంట.
ఇటీవల ఆ ఇద్దరు సీనియర్ నేతలకు వైసీపీ అధినేత జగన్ నుంచి ఓ సందేశం వెళ్లిందట. వచ్చే ఆరు నెలల్లో ఉత్తరాంధ్ర లో పార్టీ పరిస్థితి మెరుగుపరిచే బాధ్యత ఆ ఇద్దరే తీసుకోవాలట. ఆ పరీక్షలో సక్సెస్ అయితే ఓకే. లేదంటే పార్టీ లో ప్రాధాన్యం ఉండబోదని తేల్చి చెప్పారట. ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత ఈ దిగ్గజ నేతలకి ఉత్తరాంధ్రలో తమని తాము నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరీక్షలో గెలిస్తేనే రాజకీయ భవిష్యత్ లేదంటే ఇంటి దారి అంటే వాళ్ళు ఎదుర్కొంటున్నది అగ్నిపరీక్ష కాదంటారా ?