జగన్ కోసం ప్రచారం చేయనున్న షర్మిలమ్మ, విజయమ్మ !

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీడీపీ తరపున సీఎం చంద్రబాబు, వైసీపీ తరపున వైఎస్ జగన్ ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. రోజుకు రెండుమూడు చోట్ల సభలు,రోడ్‌షోలూ నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. ఇక వైఎస్సార్సీపీ తరపున ప్రచారం చేసేందుకు మరో ఇద్దరు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి వైఎస్ షర్మిల, విజయమ్మ ఎన్నికల ప్రచారానికి శ్రీకారంచుట్టనున్నారు. మంత్రి లోకేశ్ పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచే బస్సుయాత్రను ప్రారంభిచబోతున్నారు షర్మిల. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ తరపున ఆమె ప్రచారం చేస్తారు. మంగళగిరి నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం వరకు ఆమె రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మొత్తం 10 జిల్లాల్లో 50 నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు. మరోపక్క వారి తల్లి విజయమ్మ కూడా 40 నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించేలా వైసీపీ ప్రణాళిక రూపొందిస్తోంది. రాయలసీమ నుంచి విజయమ్మ రోడ్‌షో ప్రారంభించనున్నారు. షర్మిల, విజయమ్మ కలిసి ప్రతి రోజు 4-5 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు వైసీపీ నేతలు. షర్మిల, విజయమ్మ కోసం రెండు ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తున్నారు. జగన్‌తో పాటు తల్లీకూతుళ్ల ప్రచారం మొదలుపెడితే వైసీపీ మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.