పులివెందుల సీఐ మీద వైఎస్ వివేకా కూతురు అనుమానం !

వైఎస్ వివేకా హత్య జరిగి పదిరోజులు గడుస్తున్నా ఆ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా ఇంత వరకు ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నా హత్య ఎందుకు ఎవరు చేశారన్న విషయం మీద ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్యానంతరం జరుగుతున్న పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని తన తండ్రిహత్య జరిగి రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేసులో పురోగతి లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోందని అన్నారు ఆయన కూతురు సునీతారెడ్డి. కేసు దర్యాప్తును ఎవరైనా తప్పుదోవా పట్టిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేశారు. హత్య జరిగిన తర్వాత సీఐ శంకరయ్య వ్యవహరించిన తీరు అనుమానాలు కల్గిస్తుందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న తమకే హత్య అని అనుమానం వస్తే పోలీసులకి రాలేదా అని ఆమె ప్రశ్నించారు. పులివెందుల సీఐ నారాయణ సమక్షంలో తన తండ్రి మృతదేహానికి కట్లు కట్టి ఆసుపత్రికి ఎలా తరలించారని ? ఆ సమయంలో ఆయన ఎందుకు జోక్యం చేసుకోలేదు? పంచనామా జరగకుండా శవానికి కట్లు కట్టడం తప్పని ఆయనకు తెలియదా? అని ఆమె ప్రశ్నించారు. డెడ్ బాడీని తరలిస్తుంటే సీఐ ఎందుకు చూస్తుండిపోయారని ఆ సమయంలో తన బంధుమిత్రులు అక్కడే ఉన్నా వారు షాక్ లో ఉండిపోయారన్నారు. కానీ, అన్నీ తెలిసిన సీఐ శంకరయ్య తన విధినిర్వహణలో ఎందుకలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదన్నారు సునీత రెడ్డి. తన తండ్రి హత్యతో సీఐకి ప్రత్యక్ష సంబంధం ఉందా? అనే కోణంలో కూడా తమకు అనుమానాలు వస్తున్నాయని అన్నారు. వివేకా హత్య కేసులో ఇప్పటికే పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేశారు. వివేకా హత్య జరిగిన వెంటనే రక్తపు మరకల్ని కడిగేయడంలో కీలకమైన ఆధారాలు దొరికే అవకాశాలు తగ్గిపోయామని పోలీసు శాఖ భావిస్తోంది.