గొడవలుంటే చంపుకుంటామా ?…వివేకా కూతురు ప్రెస్ మీట్ !

గతవారం దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, బుధవారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆమె నాన్నకు తానంటే ఎంతో ప్రేమని, ఆయన చనిపోయిన బాధ కంటే తర్వాత మీడియాలో వచ్చిన కథనాలే తమను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిని అవమానించేలా నేతలు మాట్లాడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. పులివెందుల ప్రజలంటే నాన్నకు ఎంతో అభిమానమని, కుటుంబ కంటే వారే ముఖ్యమని అన్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా వెళ్లి అండగా నిలబడేవారని అమ్మ కూడా అనారోగ్యంతో బాధపడుతోందని, అందుకే నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారని తెలియజేశారు. తన తండ్రిని చాలా దారుణంగా హత్య చేశారని, ఈ ఘాతుకానికి పాల్పడిన హంతకులను గుర్తించడం ముఖ్యమని మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ పచ్చి అబద్దాలని కొట్టిపారేశారు. 700 మంది వరకు ఉండే కుటుంబలో చిన్న చిన్న స్పర్ధలు సహజమేనని నిజానికి జగనన్న సీఎం కావాలని నాన్న కలగన్నారని, అందుకోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. దీనిపై ఓ వర్గం మీడియా ఎన్నో వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తోందని, ఇది ఎంతమాత్రమూ సరికాదని ఆమె పేర్కొన్నారు. సిట్‌ నివేదిక వచ్చే వరకూ మీడియా, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని పుకార్లను వ్యాప్తి చేయొద్దని ఆమె కోరారు. విచారణ ఎవరు చేసినా అది నిష్పక్షపాతంగా జరగాలని, ఇంత కంటే తాను ఇప్పుడు ఏం మాట్లాడలేనని పేర్కొన్నారు.