నాడు జగన్ ప్రత్యర్ధి…రేపు జగన్ పార్టీలోకి !

YS Jagan Complaint To Governor Against AP Government

మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఎల్లుండి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. జగన్ ఆహ్వానంపై పార్టీలో చేరుతున్నానని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి తదితరులు బుధవారం ఉదయం ఖాజీపేటలో డీఎల్‌ రవీంద్రారెడ్డిని కలిశారు. అనంతరం డీఎల్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్ నాకు ఫోన్‌ చేశారు. మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరారు. చాలా ఏళ్లుగా వైఎస్‌‌ఆర్‌ కుటుంబ సభ్యుడిని. జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటా. పదిరోజుల్లో బహిరంగ సభను నిర్వహిస్తాను. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తా. వైఎస్‌ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్‌ కోరారు’ అని తెలిపారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కడప జిల్లా రాజకీయాల్లో డీఎల్ రవీంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని కాపాడుకొంటూ వచ్చారు. 2009 సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి. 2011 మార్చి 12వ తేదీన జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. ఈ సమయంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల సమయంలో కడప జిల్లా నుండి డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు.

కడప ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్ పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా మంత్రిగా ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి జగన్‌కు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా మైసూరారెడ్డి బరిలో నిలిచారు. కానీ, ఆ ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత కూడ జగన్‌కు వ్యతిరేకంగా డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీకి మద్దతిచ్చారు. ఒకనాడు జగన్‌కు వ్యతిరేకంగా ఇదే జిల్లా నుండి తీవ్రమైన విమర్శలు చేసిన డీఎల్… ఇప్పుడు అదే జగన్ పార్టీకి మద్దతిస్తానని ప్రకటించారు.

2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయాక డీఎల్ రవీంద్రారెడ్డి తిరుమల వెళ్లి మొక్కు చెల్లించుకున్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌కు పుట్టిందే పిల్ల కాంగ్రెస్. ముఖ్యంగా విజయమ్మ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయడం తీవ్ర ఆందోళన కలిగించిందని సముద్రాలు కూడా మిగలవేమోనని మదన పడుతూ దేవదేవుణ్ని ప్రార్థించానన్ శ్రీనివాసుడు నా కోరిక మన్నించాడు. అందుకే తిరుమల వచ్చి స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నానని తిరుమలేశుడి దర్శనం తర్వాత డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. అలాంటి ఆయన ఇప్పుడు జగన్ పార్టీకి మద్దతు ఇవ్వడం సంచలనం రేపుతోంది.