వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే…తేల్చిన పోస్టుమార్టం !

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో నిర్థారణ అయింది. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో వైఎస్‌ వివేకానందరెడ్డి తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు గుర్తించారు. నుదుటిపై లోతైన రెండు గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం, తొడ భాగం, చేతిపైనా మరో గాయం అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫోరెన్సిక్‌ బృందం పులివెందుల రానుంది.

ఫింగర్‌ ప్రింట్స్‌ దొరికాయి: ఎస్పీ

వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేశారని భావిస్తున్నామని ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ తెలిపారు. ఆయన శరీరంపై ఏడుచోట్ల గాయాలున్నాయన్నారు. ఈ కేసులో తమకు కొన్ని క్లూస్‌ దొరికాయని, వాటి ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. మరోవైపు వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై విచారణ నిమిత్తం సిట్‌ ఏర్పాటు అయింది. సీఐడీ విభాగం అడిషనల్‌ డీజీ అమిత్‌ గార్గ్‌ నేతృత్వంలో అయిదు పోలీసు బృందాలు విచారణ చేయనుంది. తక్షణమే విచారణ చేపట్టాలని డీజీపీ కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది.