Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2007లో గుజరాత్ లో నరేంద్ర మోడీ నేతృత్వలో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఆ సందర్భంలో కొందరు నరేంద్రమోడీ గెలిచింది ప్రతిపక్ష కాంగ్రెస్ పై మాత్రమే కాదని…తనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన జాతీయ మీడియాపైన కూడా అని రాజకీయ నిపుణులు విశ్లేషించారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ ఇప్పుడు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతోంది. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా అప్పట్లో జాతీయ మీడియా విస్తృత ప్రచారం నిర్వహిస్తే…ఏపీలో ఆ పాత్ర ఇప్పుడు సోషల్ మీడియా పోషించింది. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడింది మొదలు…అధికార టీడీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలోని కొన్ని వర్గాలు చేసిన విన్యాసాల అన్నీ ఇన్నీ కావు.
జగన్ కంటే మందుగానే ఆ వర్గాలు ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఖాయమంటూ జోస్యం చెప్పాయి. టీడీపీ పాలనపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని, నంద్యాల ఫలితాల్లో ఆ అసంతృప్తి వ్యక్తమవుతుందని అదే పనిగా ప్రచారం చేశాయి. జగన్ అనుకూల వర్గం చేసిన ఈ ప్రచారం ఎక్కడిదాకా వెళ్లిందంటే…అసలు టీడీపీ అభ్యర్థి గెలుపు సంగతి అటుంచితే…డిపాజిట్ కూడా దక్కదు అంటూ ఎద్దేవా చేసింది. దీనికి తోడు నంద్యాల ఉప ఎన్నిక మూడేళ్ల టీడీపీ పాలనపై రెఫరెండం అని జగన్ పదే పదే ప్రచారం చేస్తుంటే…టీడీపీ నేతలు మాత్రం దానికి అంగీకరించలేదు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి అయితే ఒక అడుగు ముందుకేసి రెఫరెండం కాదని కూడా అన్నారు.
సోషల్ మీడియా ప్రచారం, జగన్ వ్యాఖ్యలు, టీడీపీ నేతల రియాక్షన్ చూసి నంద్యాలలో క్షేత్ర స్థాయి పరిస్థితి తెలియని కొందరు టీడీపీ అభిమానులు ఎంతగానో కలవర పడ్డారు. ఒకానొక దశలో గెలుపు జగన్ దేనా అని సందేహ పడ్డారు కూడా…కానీ ఉప ఎన్నిక లో సీన్ రివర్స్ అయింది. టీడీపీకి నంద్యాల ప్రజలు ఘన విజయం అందించారు. టీడీపీ ఈ గెలుపు సాధించింది ప్రతిపక్షం వైసీపీ పైనేకాదని, తనపై విషప్రచారం చేస్తున్నకొన్ని వెబ్ సైట్ల పైనా అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికయినా తిమ్మిని బమ్మిని చేయటానికి ప్రయత్నించే జగన్ అనుకూల వెబ్ సైట్లకు కనువిప్పు కలిగితే అదేపదివేలు.
మరిన్ని వార్తలు: