Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో వైసీపీ నేతలు తరచూ చేసే ఆరోపణ ఒకటుంది… చంద్రబాబు డబ్బుల మూటలు వెదజల్లి ఎమ్మెల్యే లను కొనుగోలు చేస్తున్నారని. ఒక ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు అనగానే రొటీన్ గా ఈ స్టేట్ మెంట్ వచ్చేస్తుంది. అయితే తాజాగా గిడ్డి ఈశ్వరి పార్టీ మారుతారు అన్న వార్తలు వస్తున్నప్పటికీ వైసీపీ నుంచి ఇంకా ఆ రకమైన ప్రకటన రాలేదు. జగన్ కోసం దూకుడుగా వ్యవహరించే ఈశ్వరి గతంలో చంద్రబాబు మీద కూడా నోరు పారేసుకున్నారు. అప్పట్లో అంతగా మాట్లాడిన ఆమె ఇప్పుడు టీడీపీ వైపు చూడడం డబ్బు కోసం అంటే ఎవరూ నమ్మరు. ఇది పూర్తిగా వైసీపీ సెల్ఫ్ గోల్. అందుకు ప్రధాన కారణం ఉత్తరాంధ్రలో వైసీపీ వ్యవహారాలు నడిపిస్తున్న విజయసాయి రెడ్డి. ఆయన ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వారిని కాదని కష్ట కాలంలో పార్టీని కాదని వెళ్లిపోయిన వారికి పెద్ద పీట వేయడమే ఈ వివాదానికి కారణం.
వైసీపీ ఇప్పుడు దాకా చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నిజం అనుకుంటే ఇప్పుడు గిడ్డి ఈశ్వరి వైసీపీ కి గుడ్ బై కొట్టి టీడీపీ లో చేరే ఆలోచన చేస్తున్న దానికి కారణం అయిన విజయసాయి ని కూడా చంద్రబాబు కొనేసాడు అనుకోవాలి. పార్టీ ని నడుపుకోవడం లో ఇంకా తడబడుతూ, ప్రజాభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో విఫలం అయిన వైసీపీ ఇప్పటికీ అదే పద్ధతులు పాటిస్తోంది. పార్టీని నమ్ముకున్న వారికి అభద్రతా భావం కల్పించి వారే పార్టీని వదిలి వెళ్లేలా చేస్తోంది. ఇప్పటిదాకా ఇవి పార్టీ జరుగుతున్నాయని చెబితే ఎదురు దాడి చేశారు. గిడ్డి ఈశ్వరి లాంటి వాళ్ళు పార్టీని వీడితే అలాంటి వివరణలు కూడా జనం నమ్మరు. రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలు తప్ప అన్న వాదాన్ని వైసీపీ సదా గుర్తుంచుకుంటే మంచిది.