విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికులు చేపట్టిన ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ ధర్నాలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంలోనూ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ ఎంపీ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, విశాఖ స్టీల్‌ప్లాంట్ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిందన్నారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని, లేఖ ద్వారా సీఎం జగన్ ప్రత్యామ్నాయాలు సూచించారని గుర్తుచేశారు. స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాఢలని సీఎం జగన్ కోరినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్‌ప్లాంట్ అంశాలపై సభను అడ్డుకున్నామని.. సీఎం జగన్ దిశానిర్దేశంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పేర్కొన్నారు.